జెట్ స్పీడ్ తో కాళేశ్వరం

తెలంగాణ  సాగునీటి ప్రాజెక్టుల కోసం జెట్ స్పీడ్ తో సాగుతున్న మంత్రి హరీష్ రావు అదే స్పీడ్ తో అన్ని ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని అన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత స్పీడ్ గా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధికారులకు పలు సూచనలు కూడా చేశారాయన. ఇంజినీరింగ్ సిబ్బంది ఇంకాస్త కష్టపడి పనిచేసి.. 2018 నాటికి బీడుభూములకు నీళ్లందించాలని కోరారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిద్దామంటూ.. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు చెప్పారు మంత్రి హరీష్ రావు. 18నెలల్లో పూర్తయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మాణ స్థలాన్ని మూడు రోజుల్లో ఖరారు చేయాలన్నారు. ఎల్లుండి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు , రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ప్రాజెక్టు సైట్ ను సందర్శించాలని ఆదేశించారు. అలాగే 15 రోజుల్లో పనులు ప్రారంభించాలని సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీ ని కోరారు హరీష్ . కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కోసం భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇదే విషయంపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించిన హరీష్.. మంథని ఆర్డివో కు బాధ్యతలు అప్పగించాలని హరీష్ రావు సూచించారు. 15 రోజుల్లో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల దగ్గర క్యాంప్ లను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. కాళేశ్వరం బారేజీలు , పంపు హౌజ్ ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని కోరారు మంత్రి. బ్యారేజీ, పంపు హౌజ్ ల సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులన్నీ గ్యాప్ లేకుండా ఒకేసారి జరగాలని చెప్పారు.