పరకాలలో కాంగ్రెస్‌ ఎత్తు ఫలించింది

వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల పురపాలక సంఘం చైర్మన్ రాజభద్రయ్య, వైస్‌ ఛైర్మన్‌ రమ్యలను గద్దె దించేందుకు తెరాస చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొందరు కాంగ్రెస్‌ సభ్యుల మద్దతు కూడా లభించడంతో 10మంది తెరాస కౌన్సిలర్లు రాజభద్రయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ జిల్లా కాంగ్రెస్‌ నేతలు వెంటనే అప్రమ్మతమై తమ ఆరుగురు కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. 

ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఆర్డీవో మహేందర్ అధ్యక్షతన ఈరోజు ఉదయం అవిశ్వాస తీర్మానంపై జరిగిన సమావేశం జరిగింది. కానీ కాంగ్రెస్‌ సభ్యులు ఎవరూ రాకపోవడంతో కోరం లేక సభ వాయిదా వేయవలసి వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం సమావేశమైనపుడు కూడా కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ మహేందర్ ప్రకటించారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకొన్నారు. 

పరకాల పురపాలక సంఘంలో మొత్తం 20మంది సభ్యులు ఉండగా వారిలో తెరాస-10, కాంగ్రెస్‌-6, భాజపా-2,బిఎస్పి-1, ఇండిపెండెంట్ -1 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కనీసం 14మంది మద్దతు అవసరం. కానీ కాంగ్రెస్‌, బిఎస్పి, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడంతో సభలో కోరం లేక అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.