
హుజూరాబాద్ పురపాలక సంఘంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దాని చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్‌ను రాజీనామా చేయవలసిందిగా కౌన్సిలర్లు ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆయనను రాజీనామా చేయమని సందేశం పంపారు. అందుకు అయన అంగీకరించారు కానీ చిన్న మెలిక పెట్టారు. తన హయంలో నిర్మించిన కొత్త పురపాలక సంఘం భవనాన్ని మంత్రి ఈటల రాజేందర్ చేత ప్రారంభించిన తరువాతే రాజీనామా చేస్తానని చెపుతున్నారు. ఈవిషయం తెరాస నేతలు మంత్రి చెవిలో వేయడంతో విజయ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా మంత్రి ఆదేశించడంతో 18 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి జిల్లా కలెక్టరుకు అందజేశారు. అయినప్పటికీ విజయ్ కుమార్ రాజీనామా చేసేందుకు అంగీకరించలేదు. కొత్త భవనాన్ని ప్రారంభించిన తరువాతే తన పదవికి రాజీనామా చేస్తానని చెపుతున్నారు.
మంత్రి ఈటల రాజేందర్ ఇదేపని మీద గురువారం హుజూరాబాద్ వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు కొత్త భవనాన్ని ప్రారంభించబోతున్నారు. కనుక విజయ్ కుమార్ రాజీనామాకు అదే ముహూర్తమని అందరూ భావిస్తుంటే అయన మళ్ళీ మరో మెలికపెట్టారు. తాను రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని కానీ మంత్రి ఆదేశిస్తేనే చేస్తానని చెప్పి ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కనుక మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ సాయంత్రం ఆయనను రాజీనామా చేయమని కోరి ఈ సస్పెన్స్ కు తెర దించవచ్చు.