
తెలంగాణాలోని భూపాలపల్లి జిల్లాలో గల బొగత జలపాతం, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటల, పోచెర్ల జలపాతాలు పరవళ్ళు తొక్కుతూ కనువిందు చేస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. యాంత్రిక జీవనం, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులు కూడా కార్లు, బస్సులు కట్టించుకొని అక్కడకు వెళ్ళి సహజసిద్దమైన ఆ ప్రకృతిలో...ఆ జలపాతాలలో రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపివస్తున్నారు.
తెలంగాణా పర్యాటకశాఖ హైదరాబాద్ నుంచి ఈ మూడు జలపాతాలకు ప్రత్యేక బస్సులు నడిపించడం మొదలుపెట్టింది. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరుతాయి. వీటిలో బొగత జలపాతానికి వెళ్ళే బస్సులు అర్ధరాత్రి నగరానికి చేరుకొంటాయి. ఆదిలాబాద్ లోని కుంటాల, పోచెర్ల జలపాతాలకు వెళ్ళే బస్సులు రాత్రి 10గంటలకు నగరానికి తిరిగి చేరుకొంటాయి. వీటిలో ఏసి, నాన్-ఏసి బస్సులు కూడా ఉన్నాయి. ఏసి బస్సులలో ఒక్కొక్కరికీ టికెట్ రూ.1,500, నాన్-ఏసి బస్సులలో టికెట్ రూ.1,400 ఉంటుంది. దారిలో కాఫీ,టీ, టిఫిన్, భోజనం వగైరాలకు వేరేగా చెల్లించనవసరం లేదు. ఈ మూడు జలపాతాలను పర్యటించదలచుకొన్నవారు పర్యాటకశాఖకు చెందిన 1800-4254-6464 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.