హరీష్ రావు తెరాస వీడటం ఖాయం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం తెరాసలో యజమానులకు, పనిచేసేవారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. కనుక ఏదో ఓరోజు కెసిఆర్ మంత్రి హరీష్ రావును తెరాస నుంచి బయటకు పంపించడం ఖాయం. ఇక్కడ రాష్ట్రంలో ప్రత్యక్షంగా, అక్కడ కేంద్రంలో పరోక్షంగా అధికారంలో ఉన్న తెరాస ఏపికి ప్రత్యేకహోదా గురించి తన వైఖరి చెప్పకుండా మా పార్టీ వైఖరి అడుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో మాపార్టీ వైఖరి చాలా స్పష్టం. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలనేది మాపార్టీ నిర్ణయం. తెరాసలాగ మనిషో మాట చెప్పం. రాజకీయలబ్ది కోసం మాట మార్చం. ఆనాడు తెరాస ఎంపి కవిత, కెసిఆర్ ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పలేదా? మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు దేనికి? ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపిలో కలుపుతున్నప్పుడు ఇక్కడ కెసిఆర్, అక్కడ మోడీ అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు. నిజానికి ముంపు మండలాలను కలపాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడూ అనుకోలేదు. పైగా దానికి అడ్డుపడింది కూడా. ఈ విషయంపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు కెసిఆర్ కూడా సభలోనే ఉన్నారు. మరి అప్పుడు అడ్డుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడం దేనికి?” అని అన్నారు.