
గుజరాత్ లోని పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమించిన హార్దిక్ పటేల్, అతని అనుచరులు ఇద్దరికీ గుజరాత్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష, ఒక్కొక్కరికీ రూ.50,000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2015లో అతని నేతృత్వంలో సాగిన పటేళ్ళ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ ఘటనలలో అహ్మదాబాద్ నగరంలో కోట్ల రూపాయల విలువగల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దగ్ధమయ్యాయి. అదే సమయంలో మెహ్సానా జిల్లాలోని విస్నగర్ లో హార్దిక పటేల్ నేతృత్వంలో అయన అనుచరులు భాజపా కార్యాలయాన్ని తగులబెట్టి అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. గుజరాత్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, ఆ విద్వంసానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈరోజు న్యాయస్థానం అతనిని దోషిగా ప్రకటించి రెండేళ్ళ జైలుశిక్ష ఖరారు చేసింది. అయితే అతను హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
హార్దిక్ పటేల్ (25) చాలా చిన్నవయసులో చాలా తక్కువ సమయంలోనే గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకోగలిగాడు. ఆ గుర్తింపుతో రాష్ట్ర రాజకీయాలను శాశించే స్థాయికి ఎదిగినట్లే కనిపించాడు. కానీ ఆ గుర్తింపును ఎంతో కాలం నిలుపుకోలేకపోయాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక హోటల్లో ఒక అమ్మాయితో శృoగారం చేస్తూ మీడియాకు పట్టుపడటం, ఇప్పుడు ఈ కేసులో దోషిగా జైలుకు వెళ్ళవలసిరావడంతో అతను ఎంతవేగంగా పైకి ఎదిగాడో అంతకంటే వేగంగా పతనం అయినట్లయింది.