
సీనియర్ కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ తెరాసలో చేరబోతున్నారంటూ నేటికీ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. జూలై 1వ తేదీన పుట్టినరోజునాడు పార్టీ మారడంపై అయన తన నిర్ణయం ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. వాటిని దృవీకరిస్తున్నట్లు తెరాస నగర అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులను వెంటబెట్టుకొని ముఖేష్ గౌడ్ ఇంటికి వెళ్లి తెరాసలో చేరవలసిందిగా ఆయనను ఆహ్వానించారు.
ఈ సంగతి తెలుసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హనుమంతరావుతో సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు హడావుడిగా అయన వద్దకు వెళ్లి పార్టీ మారవద్దని నచ్చచెప్పడంతో ఆయన మెత్తబడి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. కానీ నేటికీ ఆయన పార్టీ మారుతారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
వాటిపై అయన స్పందిస్తూ, “నేనుపార్టీ మారబోతున్నానని మీడియాలో వస్తున్న ఊహాగానాలలో నిజం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. కొన్నిరోజుల క్రితమే నేను ఏఐసిసి కార్యదర్శి బోసురాజుతో ఇదే విషయమై వివరణ ఇచ్చాను. జి.హెచ్.ఎం.సి.పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించుకొనేందుకు నేను గట్టి ప్రయత్నాలు చేస్తాను,” అని ముఖేష్ గౌడ్ చెప్పారు.