వాళ్ళిద్దరూ రాజీనామాలు చేయాలి: తెరాస

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటనకు నిరసనగా టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానా రెడ్డి ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలనీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ అధిష్టానం మళ్ళీ హామీ ఇచ్చింది. తెలంగాణాకు అన్యాయం జరుగుతుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు? ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా ఏపి బంద్‌కు వైకాపా పిలుపునిస్తే అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలే మద్దతు ఇవ్వలేదు. మరి కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వాలనుకొంటోంది? తమ అధిష్టానం వైఖరికి నిరసనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలి,” అని మంత్రులు ఇదరూ డిమాండ్ చేశారు.