
మోస్ట్ డైనమిక్ లీడర్ అని పేరు సంపాదించుకొన్న ఐటి శాఖామంత్రి కేటీఆర్ పుట్టినరోజు ఈరోజు. ఆయనకు ఇటు రాజకీయాలలో ఎంతమంది స్నేహితులు, అభిమానులు ఉన్నారో సినీపరిశ్రమలో, దేశవిదేశాలలో కూడా అంతేమంది ఉన్నారు. కనుక ఈరోజు అనేకమంది ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేటిఆర్ జీవితచరిత్ర ఒక తెరిచిన పుస్తకం వంటిది. కనుక అయన ఏవిధంగా ఈ స్థాయికి చేరుకొన్నారో అందుకు అయన ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అయినప్పటికీ కొండను అద్దంలో చూపే ప్రయత్నంగా అయన జీవిత విశేషాలను క్లుప్తంగా తెలియజేస్తున్నాము.
చదువులు:
కేటిఆర్ 1976, జూలై 24న కరీంనగర్ లో జన్మించారు. 7వ తరగతి వరకు కరీంనగర్ లోనే చదువుకొన్నారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చేసి యూసఫ్ గూడలోని అమరావతి పబ్లిక్ స్కూల్లో చదువుకొన్నారు. దానిలో నుంచి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు మారారు. ఆ తరువాత గుంటూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో బిఎస్సీ చేశాక పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశారు. ఆ తరువాత పైచదువులకు అమెరికా వెళ్ళారు. అక్కడ న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఎంబిఏ, ఈ-కామర్స్ లో 2000 సం.లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అదే సమయంలో అక్కడే మాడిసన్ ఎవెన్యూ లోగల ఇంట్రా ఇంక్ అనే సంస్థలో రెండు సం.లు ఇంటర్న్ షిప్ చేశారు. ఆ తరువాత అమెరికాలోనే కొంతకాలం పాటు ఉద్యోగం చేశారు.
సంసారం:
కేటిఆర్ అర్ధాంగి పేరు కె షర్మిల. ఆ దంపతులకు హిమంషు అనే ఒక కుమారుడు అలేఖ్య అనే ఒక కుమార్తె ఉన్నారు. భర్త అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ శ్రీమతి షర్మిల చాలా నిరాడంబర జీవితం గడుపుతారు. మీడియాకు, రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. అందుకే ఆమె గురించి ఎన్నడో మీడియాలో వార్తలు కనిపించవు.
ఉద్యమాలు:
కేటిఆర్ తండ్రి కెసిఆర్ తెలంగాణా సాధన కోసం తెరాసను స్థాపించి పోరాటాలు ప్రారంభించినప్పుడు తండ్రి పిలుపు అందుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ తిరిగివచ్చారు. మొట్టమొదటిసారిగా 2009లో కేటిఆర్ సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు ఊపందుకోవడంతో కేటిఆర్ తో సహా 10మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమాలలో భాగంగా రైల్ రోకో చేసినందుకు 2013, జనవరి 27న అరెస్ట్ అయ్యారు.
మంత్రి పదవులు:
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవుతున్న సమయంలో జరిగిన 2014 ఎన్నికలలో తెరాస తరపున సిరిసిల్ నుంచి పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా తెలంగాణా శాసనసభలో అడుగుపెట్టారు. వెంటనే రాష్ట్ర ఐటి శాఖామంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత 2015లో రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 2016లో జరిగిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస తరపున ప్రచారం చేసి ఘనవిజయం సాధించిన తరువాత ఆయనకు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖల బాధ్యత కూడా అప్పగించబడింది. ఆ తరువాత శాఖల బదిలీలో పంచాయితీరాజ్ శాఖను వదులుకొని పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాలను చూసుకొంటున్నారు.
ఈ నాలుగేళ్ళ సమయంలోనె మంత్రి కేటిఆర్ ఇటు ప్రభుత్వంలో, అటు రాజకీయాలలో తన సమర్ధతను నిరూపించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు. రాజకీయాలలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో, ప్రభుత్వ వ్యవహారాలలో అంతే చురుకుగా వ్యవహరిస్తారని మంచిపేరు సంపాదించుకొన్నారు. డిల్లీలో కేంద్రమంత్రులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ ఆయన మాట తీరు, వ్యవహార జ్ఞానం చూసి ప్రసంశించకుండా ఉండలేరు. ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించే గుణం ఉన్నందున ప్రజలు కూడా ఆయనను అభిమానిస్తుంటారు.
విజయాలు:
ఈ జాబితాయే అన్నిటికంటే చాలా పెద్దది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమజాన్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్ తరలిరావడం వెనుక కేటిఆర్ కృషి చాలా ఉంది. అలాగే ఐటి, ఫార్మా, ఎలెక్ట్రానిక్ తదితర సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. వాటి కోసం ప్రభుత్వం విధానాలను సమూలంగా ప్రక్షాళన చేసి సరళమైన విధానాలు ప్రవేశపెట్టారు. ఐటి హబ్ వంటి వినూత్నమైన ఆలోచనలకు ఆచరణరూపం కల్పించి చూపారు. ఇక గత ఏడాది డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగిన జీఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇవాంక ట్రంప్ సైతం కేటిఆర్ ప్రసంగాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.
ఈ నాలుగేళ్ళలో కేటిఆర్ స్వీడన్, జర్మనీ, అమెరికా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ తదితర అనేక దేశాలలో పర్యటించి అనేకమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకొన్నారు. అనేక అంతర్జాతీయ సదసులలో పాల్గొన్నారు. ఈవిధంగా ఇంటాబయటా కూడా గెలివగలిగిన నాయకులు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. తెలంగాణా అభివృద్ధి కోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్న డైనమిక్ లీడర్ కేటిఆర్ గారికి మై తెలంగాణా డాట్ కాం తెలంగాణా ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.