రాష్ట్రంలో రెండో విమానాశ్రయం బసంత్‌నగర్‌లో?

రాజధాని హైదరాబాద్ నగరంలో విమానాశ్రయం ఉండటం గొప్ప విషయమేమీ కాదు కానీ అన్ని విధాల అభివృద్ధి చెందిన జిల్లాలలో విమానాశ్రయాలు లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక రాష్ట్రంలో వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించమని మంత్రి కేటిఆర్ అధికారులను ఆదేశించారు. 

వాటిలో మొట్టమొదటగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 12కిమీ దూరంలో ఉన్న బసంత్‌నగర్‌ నుంచే విమానసేవలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, బసంత్‌నగర్‌లో ఇప్పటికే విమానాశ్రయం ఉంది. కేశోరాం సిమెంట్ అధినేత బసంత్ కుమార్ బిర్లా దానిని 1972లో నిర్మించారు. అక్కడ తన కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అప్పుడప్పుడు ప్రత్యేక విమానంలో అక్కడకు వస్తుండేవారు. ఆ విమానాశ్రయం నుంచి కొంతకాలంపాటు హైదరాబాద్ కు వాయుదూత్ విమానాలు కూడా నడిచాయి. అయితే ఆరోజుల్లో సామాన్య ప్రజలు ఎవరూ విమానాలలో ప్రయాణించేవారు కాదు కనుక విమానసేవలు నిలిపివేయబడ్డాయి. అప్పటి నుంచి కేశోరాం సిమెంట్స్ సంస్థ ఆ విమానాశ్రయాన్ని40 ఏళ్లకు లీజుకు తీసుకొని తన అవసరాలకు వినియోగించుకొంటోంది. కొంతకాలం క్రితమే ఆ లీజును రద్దు చేసుకొని ప్రభుత్వానికి ఆ విమానాశ్రయాన్ని వాపసు చేసింది. 

ఇప్పుడు పెరిగిన రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా తెలంగాణాలో కొత్తగా మరో 5 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని తెరాస సర్కార్ ఆలోచనలు చేస్తుంటే, అక్కడ మోడీ సర్కార్ కూడా దేశంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేసి, సామాన్యప్రజలకు విమానయానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పలుపధకాలు ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో 5 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. 

బసంత్‌నగర్‌లో ఇప్పటికే విమానాశ్రయం సిద్దంగా ఉంది. దానిని ఆధునీకరించడం పెద్ద కష్టమైనపని కాదు. కనుక హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో తొలివిమానం అక్కడి నుంచే ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రామగుండం విద్యుత్ సంస్థ, సింగరేణి, కేశోరాం సిమెంట్, ఫెర్టిలైజర్స్ సంస్థలు ఉన్నాయి. ఇక రామగుండంలో ఎన్టిపిసి విస్తరణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కనుక ఆ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు, ఉద్యోగుల రాకపోకలు సాగుతాయి. బసంత్ నగర్ నుంచి విమానసేవలు మొదలైనట్లయితే పెద్దపల్లితో పాటు జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విమానాశ్రయాలు ఏర్పాటుపై చాలా ఆసక్తి చూపిస్తున్నాయి కనుక బహుశః మరొక ఏడాదిలోపే రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.