
తెలంగాణా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి వారంలో మరో కొత్త పధకాన్ని ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో విజయా, మదర్, ముల్కనూర్, కరీంనగర్ డెయిరీలలో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మంది పాడిరైతులకు ఆవులు, గేదెలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. ఈ పధకం కోసం అధికారులు పంజాబ్, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎక్కువ పాలిచ్చే మేలుజాతి పశువులను కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.
ఈ పంపిణీ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆగస్ట్ మొదటివారం నుంచి ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఒక్కో ఆవు, గేదెకు మూడేళ్ళపాటు భీమా దానితో పాటు ఇతర ఖర్చుల నిమిత్తం రూ.5,000 నగదు, 300కిలోల దాణా కూడా అందించబోతున్నామని మంత్రి తలసాని చెప్పారు.