
గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో లారీల యజమానులు సమ్మె చేస్తుండటంతో లక్షలాది లారీలు నిలిచిపోయాయి. సరుకు రవాణా, లారీలపై విధిస్తున్న రకరకాల పన్నులు, రెండు రాష్ట్రాలలో టోల్ గేట్ పన్నులు, నానాటికీ పెరుగుతున్న డీజిల్, వాహనాల విడిభాగాల ధరల కారణంగా తాము చాలా నష్టపోతున్నామని కనుక కేంద్రప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు సమ్మె చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు తెస్తున్న వాహనాలను కూడా లారీల యజమానులు అడ్డుకొంటున్నారు. అయితే నేటి వరకు పాలు, కూరగాయలు, పప్పులు మొదలైన నిత్యావసరవస్తువులను తీసుకువెళ్ళే లారీలను, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో బంద్ ప్రభావం ఇంకా మార్కెట్లపై పడలేదు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కేంద్రం పట్టించుకోకపోవడంతో నేటి నుంచి సమ్మెను ఉదృతం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలలో లారీల యజమానుల సంఘాలు నిర్ణయించాయి.
తెలంగాణా లారీల యజమానుల సంఘాల నేతలు సోమవారం సచివాలయానికి వెళ్ళి తమ గౌరవాధ్యక్షుడు, తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు.
అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “మేము ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశ్యంతో నిత్యావసర సరుకు రవాణా వాహనాలను సమ్మెకు దూరంగా ఉంచాము. కానీ నాలుగు రోజుల నుంచి లక్షలాది లారీల యజమానుల సమ్మె చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం వారిని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కనుక నేటి నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్యాంకర్లను కూడా నిలిపివేయాలని నిర్ణయించాము. ఇప్పటికీ కేంద్రం దిగిరాకపోతే తరువాత విమానాశ్రయాలకు ఇందనం సరఫరా నిలిపివేస్తాము. ఆ తరువాత పాలు, కూరగాయలు మొదలైన నిత్యావసర సరుకులను తీసుకువెళ్ళే వాహనాలను నిలిపివేసి మా సమ్మెను ఉదృతం చేస్తాము. రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగే వాహనాలకు ఒక్కచోటే పన్ను వసూలు చేసే విధానం అమలుచేయడానికి సహకరించాలని మేము ఏపి ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ అది సహకరించడం లేదు. త్వరలో మళ్ళీ మరోసారి ఏపి ప్రభుత్వంతో దీనిపై చర్చించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాము,” అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
లారీ యజమానుల సమస్యలు సహేతుకమైనవే. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లారీల బంద్ ను ఉదృతం చేస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో సరుకు రవాణా నిలిచిపోతే ప్రజలు ఇబ్బందిపడతారు. అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వాన్నే నిందిస్తారు తప్ప కేంద్రాన్ని కాదు. లారీల సమ్మె వలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు తెలియదనుకోలేము. మరి తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేపని చేయడం సమంజసమేనా అని ఆలోచిస్తే మంచిదేమో? లారీ యజమానుల సమ్మెను ఉదృతం చేసి వారి సమస్యలను పరిష్కరించాలనుకోవడం కంటే అధికారపార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధిగా శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కదా?