
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తెరాస ఎంపిలు, సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తెరాస ఎంపిలు శిఖండిలా వ్యవహరించారని ఆరోపించారు. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంటులో వాగ్దానం చేసినప్పుడు తెరాస ఎంపిలు కూడా దానికి అంగీకరించారని, కానీ కేంద్రప్రభుత్వం ఆ హామీని అమలుచేయనందుకు ఏపి ఎంపిలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తెరాస ఎంపిలు మద్దతు ఇవ్వకుండా మోడీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. తద్వారా తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు.
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలోనే తెలంగాణా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర సాధనకోసం పోరాడారని కానీ ఆ తరువాత వచ్చిన కెసిఆర్ తనే పోరాడి సాధించినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చి ఉండి ఉంటే కెసిఆర్ తెలంగాణా కోసం పోరాడి ఉండేవారా? అని ప్రశ్నించారు. హరీష్ రావు ఉద్యమసమయంలో యువతను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతూ పరోక్షంగా వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.