అల్వాల్ ప్రజల విచిత్ర నిరసన

హైదరాబాద్ నగరంలో అల్వాల్ ప్రజలు శనివారం ప్రభుత్వానికి చాలా విచిత్ర పద్దతిలో నిరసన తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో రోడ్లు వెడల్పు చేయడానికి 2014లో శిలాఫలకం వేయబడింది. అంతే! ఆ తరువాత అధికారులు, నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదు. అల్వాల్ లోని 41 కాలనీల ప్రజలు గత నాలుగేళ్ళుగా అనేకసార్లు అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు దీని గురించి మోరపెట్టుకొన్నారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరికి శనివారం అల్వాల్ అలైడ్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఆ శిలాఫలకానికి పూలదండ వేసి శ్రద్దాంజలి ఘటించి వినూత్నంగా నిరసన తెలియజేశారు. 

అనంతరం అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, “ఈ పనికి నిధులు కేటాయించకుండా శిలాఫలకం వేసినట్లు మాకు తెలిసింది. నిధులు కేటాయించనప్పుడు రాజకీయ నేతలు ఆర్భాటంగా శిలాఫలకాలు వేయడం వలన ప్రజాధనం వృధాకావడం తప్ప వేరే ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ రోడ్లు వెడల్పు కార్యక్రమం జరగదు కనుక ఈ ప్రాజెక్టు మరణించినట్లు భావించి దండవేసి శ్రద్దాంజలి ఘటించాము,” అని అన్నారు.