హైదరాబాద్ మెట్రోలో మరో అరుదైన కార్యం

హైదరాబాద్ మెట్రో నిర్మాణపనులు పూర్తవుతున్న కొద్దీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలికివస్తున్నాయి. తాజాగా 221 అడుగుల పొడవు, 9,60 టన్నులు (9,60,000 కేజీలు) బరువు కలిగిన అతిబారీ స్టీల్ బ్రిడ్జిని కేవలం 6గంటల వ్యవధిలో 40 అడుగుల ఎత్తులో బిగించారు మెట్రో, ఎల్&టి ఇంజనీర్లు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పాతగాంధీ ఆసుపత్రి నుంచి బోయిగూడ-జేబీస్-ఎం.జి.బి.ఎస్.మీదుగా ఫలక్ నూమాకు వెళ్ళే మెట్రో కారిడార్-2లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పడమర వైపు నిర్మించబడింది.

సికింద్రాబాద్ వంటి అత్యంత రద్దీగల రైల్వే స్టేషన్ పై ఈ బ్రిడ్జిని ఎటువంటి ప్రమాదాలు లేకుండా అంత తక్కువ సమయంలో బిగించడం మామూలు విషయమేమీ కాదు. ఎల్&టి సంస్థ ఒకపక్క స్టేషన్ వద్ద ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి రెండు వైపులా సుమారు 40 అడుగుల ఎత్తు ఉండేవిధంగా రెండు బారీ గడ్డర్లను నిర్మించడం మొదలుపెట్టింది. అదేసమయంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఎల్&టి కర్మాగారంలో ఈ బారీ స్టీల్ బ్రిడ్జిని తయారుచేశారు. దానిని విడిభాగాలుగా సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చిన తరువాత నట్లు, బోల్టులతో జోడించారు. 

ఆ తరువాత సుమారు ఆరు గంటలపాటు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ళ రాకపోకలు నిలిపివేసి, ఆ బారీ బ్రిడ్జిని రైల్వే ట్రాక్ పైకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఒక్కోటి 100 టన్నుల సామర్ధ్యం ఉన్న రెండు బారీ హైడ్రాలిక్ జాక్స్ ద్వారా అంత బారీ బ్రిడ్జిని 40 అడుగులు పైకి లేపి ముందే సిద్దం చేసి ఉంచిన గడ్డర్ బీమ్స్ పైకి చేర్చి బిగించడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్ మెట్రో ఇంజనీర్లు, ఎల్&టి సంస్థ, కార్మికులు కలిసి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఎటువంటి ప్రమాదం జరుగకుండా విజయవంతంగా పూర్తిచేశారు.

దీనిలో మెట్రో రైళ్ళు ప్రయాణిస్తుంటే క్రింద సాధారణ రైళ్ళు ప్రయాణిస్తుంటాయి. ఈసారి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళితే ఈ మెట్రో బ్రిడ్జిపై ఓ లుక్ వేయడం మరిచిపోవద్దు. ఎందుకంటే దేశంలో అంత తక్కువ సమయంలో బిగించబడిన బ్రిడ్జి ఇదే.