అదే కెసిఆర్ ప్రత్యేకత

విలక్షణంగా ఆలోచించడం, ప్రజావసరాలకు అనుగుణమైన పధకాలను రూపొందించడం, వాటిని అంతే పటిష్టంగా అమలుచేయించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు మరెవరూ సాటిరారని చెప్పవచ్చు. అది నిజమని నిరూపిస్తూ అయన మరో సరికొత్త ఆలోచన చేశారు. 

తెలంగాణా ప్రభుత్వం హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మొక్కలు నటిస్తోంది. అయితే దేశంలో అన్ని ప్రభుత్వాలు మొక్కలు నాటిస్తుంటాయి కనుక హరితహారం కూడా అందులో ఒకటి అనుకోవచ్చు. కానీ అక్కడే కెసిఆర్ తన విలక్షణతను చాటి చెప్పుకొన్నారు. 

ఆ పనులకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కూలీలను ఉపయోగించుకోవలాని నిర్ణయించారు. తద్వారా వారికి సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించడమే కాకుండా వేసిన అన్ని మొక్కలను సంరక్షించుకోవచ్చు. వారికి ఉపాధిహామీ పధకానికి కేటాయించిన నిధుల నుంచి చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. తద్వారా కేంద్రం నుంచి అందుతున్న నిధులు మురగబెట్టి వెనక్కు తిప్పి పంపకుండా, ఇటువంటి మంచి కార్యక్రమం కోసం ఖర్చు చేసుకోవచ్చు. 

హరితహారం పధకంలో ఎటువంటి మొక్కలు వేస్తే మంచిదో సిఎం కెసిఆరే సూచించారు. మనం వేసే మొక్కల వలన మనుషులకే కాకుండా కోతులు, ఉడతలు, పక్షులు మొదలైన ప్రాణులకు కూడా ఆహారం లభించే విధంగా పండ్ల మొక్కలు కూడా వేయాలని సూచించారు. తద్వారా వాటికి ఆహారం లభిస్తుంది కనుక కోతులు మొదలైన జంతువులు  జనావాసాలలోకి రాకుండా ఉంటాయని అన్నారు. 

హరితహారమే ఒక మంచి ప్రయత్నమనుకొంటే మళ్ళీ దానికి ఉపాధిహామీ నిధులు వినియోగించుకోవాలని, హరితహారంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని, అన్ని ప్రాణులకు ఆహారం అందించవచ్చని ఆలోచనలు చేయడం కెసిఆర్ గొప్పదనం. ఒక పధకంతో ఇన్ని ప్రయోజనాలు సమకూర్చవచ్చని సిఎం కెసిఆర్ నిరూపిస్తున్నారు. తపన, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి అద్భుతాలు సృష్టించవచ్చో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, కెసిఆర్ కిట్స్ వంటివి నిరూపిస్తున్నాయి. కనుక అధికారులు, ఉద్యోగులు అందరూ ఈ హరితహారం కార్యక్రమాన్ని కూడా అదే స్పూర్తితో ఆచరణలో పెట్టగలిగినప్పుడు అద్భుతమైన ఫలితాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి.