సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

సిఎం కెసిఆర్ మరొక సంచలన నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరాలంటే 200 మంది జనాభా ఉన్న గ్రామానికి కూడా ఒక కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. అందుకోసం కొత్తగా 9,200 గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆదివారం ప్రగతిభవన్ లో అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకొన్న వాటితో కలిపి మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. కానీ ప్రస్తుతం 3,562 మంది గ్రామపంచాయితీ కార్యదర్శులే ఉన్నారు. కనుక వారే మండలంలో ఇతర పంచాయితీల బాధ్యత కూడా చూడవలసివస్తోంది. పర్యవేక్షణ లోపం వలన గ్రామాలలో ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పనుల అమలులో జాప్యం అవుతోంది. కనుక ప్రతీ గ్రామానికి ఒకరు చొప్పున కొత్తగా 9,200 గ్రామ కార్యదర్శుల నియమించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నియామక ప్రక్రియను వారం రోజులలోపుగా మొదలుపెట్టి రెండు నెలలలో పూర్తిచేయాలని సిఎం కెసిఆర్ నిర్దిష్టమైన గడువు కూడా విధించారు.

ఈ నియామకాలకు సంబంధించి సిఎం కెసిఆర్ కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించారు. కొత్తగా నియమింపబడుతున్న గ్రామ కార్యదర్శులకు మూడేళ్ళపాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉండాలని, ఆ మూడేళ్ళలో వారి పనితీరు ఆధారంగానే వారి ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. కొత్తగా నియమింపబడే గ్రామకార్యదర్శులకు నెలకు రూ.15,000 జీతంగా నిర్ణయించారు. ఈ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అలాగే వారి విధులు, బాధ్యతలు, అధికారాలు తదితర అన్ని అంశాలపై విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమీషనర్ నీతూ ప్రసాద్ లను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఆ నివేదికను తయారుచేసి తనకు సమర్పించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.