
కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటిసారిగా ఒక బారీ పంప్ ట్రయల్ రన్ శనివారం విజయవంతంగా పూర్తయింది. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ 8వ ప్యాకేజీ లో భాగంగా ఏర్పాటు చేసిన 139 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన బారీ పంప్ ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసింది. రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ట్రయల్ రన్ విజయవంతం అవడంతో అయన ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్లను, అధికారులను, కార్మికులను అందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణా చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అయ్యిందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తమ ప్రయత్నాలు ఒకటొకటిగా ఫలిస్తున్నాయని, ఈ మహాయజ్ఞంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు.