రేవంత్‌కు ఆ పదవి ఇస్తే...

తెదేపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఇంతవరకు పార్టీలో ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించినపుడే ‘సముచిత స్థానం’ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ ‘సముచిత స్థానం’ ఏమిటో ఇంతవరకు తెలియదు. కనుక రేవంత్ రెడ్డి అదేపని మీద ఆదివారం డిల్లీ బయలుదేరుతున్నారు. తనకు కాంగ్రెస్‌ ప్రచారకమితీ చైర్మన్ పదవి కావాలని అయన కోరుతున్నట్లు సమాచారం. ఆ స్థాయి నేతను పార్టీలోకి రప్పించు కొన్నప్పుడు అటువంటి పదవులు ఆశించడం సహజమే కానీ కాంగ్రెస్ పార్టీ అనేకమంది హేమాహేమీలు ఉండగా వారిని కాదని నిన్నగాక మొన్న కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఏ పెద్ద పదవిని ఇచ్చినా పార్టీలో సీనియర్లు తప్పకుండా అభ్యంతరం చెప్పవచ్చు. బహుశః అందుకే రేవంత్ రెడ్డికి ‘సముచిత స్థానం’ కల్పించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సంకోచిస్తున్నట్లుంది. కానీ ఆయనకు ఇంకా ఏ పదవీ ఈయకుండా ఆలస్యం చేస్తే అయన అసంతృప్తి చెందవచ్చు. కనుక రేవంత్ రెడ్డికి పార్టీలో ‘సముచిత స్థానం’ కల్పించడం కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సామువంటిదేనని చెప్పవచ్చు.