
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే అప్పుడే అన్ని పార్టీలలో నేతలు టికెట్స్ కోసం కీచులాడుకొంటున్నారు. తెరాసలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ ఇస్తామని సిఎం కెసిఆర్ స్వయంగా చెప్పినా కూడా పార్టీలో టికెట్స్ కోసం కీచులాడుకొంటుండటం విశేషం.
ఇదే విషయంలో వరంగల్ తూర్పు తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖకు, నగర మేయర్ నరేందర్‌కు మద్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ సాగుతోంది. అదిప్పుడు డైరెక్ట్ వార్ గా మారింది.
నగరంలో ఒక మినార్ నిర్మాణ వ్యవహారంలో కొండా సురేఖ మేయర్ నరేందర్‌తో అమీతుమీకి సిద్దమయ్యారు. అనుమతి లేకుండా నిర్మించిన మినార్‌ను మేయర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. అందుకు నిరసనగా స్థానిక ముస్లిం ప్రజలు ధర్నా చేశారు. కొండా సురేఖ వారికి మద్దతుగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “నగర మేయర్ నరేందర్ ముస్లిం ప్రజల మనోభావాలు దెబ్బ తీశారు. దాంతో వారు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. వారి ఆవేదనను అర్ధం చేసుకొని నేను కూడా వారికి మద్దతు పలికాను. మళ్ళీ అక్కడే మినార్‌ను పునర్ణిస్తానని హామీ ఇచ్చి వారిచేత ధర్నా విరమింపజేశాను,” అని అన్నారు.
ఆ తరువాత మేయర్‌పై తన ఆగ్రహానికి అసలు కారణం కొండా సురేఖ మెల్లగా బయటపెట్టారు. “మేయర్ నరేందర్ తనకు సంబంధం లేని వ్యవహారాలలో తలదూరుస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తనకే ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని ప్రచారం చేసుకొంటున్నారు. ఆ సంగతి నాకు చాలా కాలం క్రితమే తెలిసినప్పటికీ ‘బచ్చాగాడు ఏదో చెప్పుకొంటున్నాడని’ పట్టించుకోలేదు. కానీ రాన్రాను అతను చాలా రెచ్చిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు అంతటివాడే మమ్మల్ని ఏమీ చేయలేకపోయాడు. ఇక నువ్వెంత? నేను ఒక చిన్న కనుసైగ చేస్తే చాలు రాత్రికి రాత్రే నీ ఇల్లు ద్వంసం అయిపోయుండేది. కానీ ముస్లిం ప్రజలు నామీద గౌరవంతో సంయమనం పాటిస్తున్నారు. కనుక నరేందర్ ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకొని నగరాభివృద్ధిపై దృష్టి పెడితే నీకే మంచిది,” అని కొండా సురేఖ హెచ్చరించారు.