జూలై 24న ఏపి బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వైఖరిని నిరసనగా జూలై 24వ తేదీన ఏపి బంద్ కు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో నిన్న జరిగిన చర్చపై తన స్పందన తెలియజేసేందుకు శనివారం అయన కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అయితే కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా బండ్ నిర్వహించాలనుకొన్నప్పుడు నేరుగా కేంద్రాన్ని, ప్రధాని నరేంద్రమోడీని నిలదీయాలి. కానీ యధాప్రకారం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 

తెదేపా-భాజపాలు పైకి శత్రువులలాగ నటిస్తున్నప్పటికీ వాటి మద్య ఉన్న రహస్య అనుబంధం అడుగడుగునా బయటపడుతూనే ఉందని అన్నారు. తాను ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంటే అవహేళన చేసిన చంద్రబాబు నాయుడు హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని కేంద్రమంత్రులకు సన్మానాలు కూడా చేశారని, ఇప్పుడు అదే చంద్రబాబు ప్రత్యేకహోదా ఇవ్వలేదని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడారని అన్నారు. చంద్రబాబు నాయుడుకి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకొంటే తక్షణమే తన ఎంపిలందరి చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.