ఆ కేసులో రేవంత్ రెడ్డికి ఊరట

కాంగ్రెస్‌ నేత, కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై పారిశ్రామికవేత్త ఏ.రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాపై స్పెషల్  సెషన్స్ కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఈ కేసుకు సంబంధించి విచారణను నిలిపివేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.సత్యనారాయణ మూర్తి ఆదేశాలు జారీ చేశారు. 

రామేశ్వరరావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తెలంగాణా ప్రభుత్వం ఆయనకు సుమారు రూ.2,000 కోట్లు విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టిందని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను నిరూపించాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని రామేశ్వరరావు చేసిన హెచ్చరికలను రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో అయన 2015లో 17వ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ తరువాత ఆ కేసును స్పెషల్  సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. 

ఆ కేసు విచారణను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా రేవంత్ రెడ్డి ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలను ప్రజలకు తెలియజేశారని, దానిపై పరువు నష్టం దావా వేయడం సరికాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి స్పెషల్  సెషన్స్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణను నిలిపివేయాలని ఆదేశించారు.