సమైక్యరాష్ట్రంలో అభివృద్ధి హైదరాబాద్ కే పరిమితం అయ్యుండేది. కానీ తెలంగాణా ఏర్పడిన తరువాత అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ కారణంగా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణా ముందుంటోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మరొక కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయడం కూడా అవసరమవుతోంది. అదీగాక సామాన్యప్రజలకు కూడా విమానయానం అందుబాటులోకి తీసుకురావాలని భావించిన కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కనీస లాభదాయకమైన ప్రాంతాలలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించాలని నిర్ణయించింది. దానిలో భాగంగా తెలంగాణాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైలారం గ్రామపంచాయితీ పరిధిలోగల పునుకుడు చెలకవద్ద విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా సూత్రప్రాయంగా అంగీకరించింది.
అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 1600 ఎకరాలు ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. దాంతో కేంద్రప్రభుత్వం కూడా వెంటనే స్పందించి పునుకుడు చెలకవద్ద విమానాశ్రయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి గత ఏడాది ఆగస్ట్ 6వ తేదీన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (రైట్స్) ప్రతినిధులను పంపింది. వారు అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేసి కేంద్రానికి తమ నివేదికను సమర్పించారు. అన్నీ అనుకూలంగా ఉండటంతో పునుకుడు చెలకవద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కానీ తాజా సమాచారం ప్రకారం కేంద్రం సరికొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాన్ని పునుకుడు చెలకవద్ద కాకుండా పాల్వంచలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం మారడానికి కారణం ఏమిటో, ఎవరో తెలియదు కానీ ఈ కొత్త ప్రతిపాదనతో కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లే ఉంది. మరి రాష్ట్రంలో కొత్త విమానాశ్రయం ఎప్పుడు ఏర్పాటు అవుతుందో చూడాలి.