
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో శుక్రవారం సాయంత్రం బారీ ప్రేలుడు జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద నిలిపి ఉంచిన జెసిబిలో బండరాళ్ళను పేల్చడానికి వినియోగించే జిలెటిన్ స్టిక్స్ ప్రమాదవశాత్తు పేలడంతో అంత బారీ జెసిబి యంత్రం కూడా గాలిలోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రేలుడు ధాటికి పరిసర ప్రాంతాలలో అనేక భవనాలు దెబ్బ తిన్నాయి.
నగరంలో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల నిర్మాణాలు చాలా జోరుగా సాగుతున్నాయి. వాటిలో అనేకమంది కాంట్రాక్టర్లు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణపనులు చేపడుతున్నారు. 2016, డిసెంబర్ 8వ తేదీన ఇదే ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోగా దానిలో ఉన్న పదిమంది కూలీలు చనిపోయారు. జి.హెచ్.ఎం.సి. పర్యవేక్షణలోపం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ప్రేలుళ్ళు జరిపారని, అప్పుడూ జి.హెచ్.ఎం.సి. అధికారులు ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.