రాష్ట్ర భాజపా నేతలకు అమిత్ షా క్లాస్?

భాజపా జాతీయఅధ్యక్షుడు అమిత్ షా ఈ నాలుగేళ్ళలో తెలంగాణాలో కనీసం 7-8 సార్లు పర్యటించి ఉంటారు. వచ్చిన ప్రతీసారి రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా బలపరుచుకోవాలో, ఎన్నికల కోసం ఏవిధంగా ముందుకు సాగాలో చెపుతూనే ఉన్నారు. పార్టీ నేతలు హైదరాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని, బూత్ స్థాయి వరకు కార్యకర్తలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇవాళ్ళ (శుక్రవారం) రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు పార్టీ నేతలందరికీ క్లాస్ పీకినట్లు సమాచారం.  

గతంలో అయన రాష్ట్ర పర్యటినకు వచ్చినపుడు ఆయన చేసిన సూచనల ప్రకారం రాష్ట్ర భాజపా నేతలు తరచూ జిల్లాలలో పర్యటిస్తూ, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి పార్టీ సూచించిన మార్గదర్శకాలకు భిన్నంగా సాగుతున్నాయని అమిత్ షా పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగవలసి ఉండగా, అగమ్యంగా ముందుకు సాగుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుక వీలైనంత త్వరగా పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అమిత్ షా సూచించారు. బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తలలో ద్విచక్ర వాహనాలు, స్మార్ట్ ఫోన్స్ కలిగి ఉన్నవారిని కనీసం ఐదుగురిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షా సూచించారు. పార్టీ నేతలు అందరూ తమ పనితీరును మరింత మెరుగుపరచుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.