నేటి నుంచి కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ

సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏపి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఉమెన్ చాందీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నప్పటికీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం విశేషం. మీడియా ప్రతినిధులు దీనిపై ఆయనను ప్రశ్నించగా అవును..కాదు.. అని సమాధానం చెప్పకుండా ‘మీరే చూస్తారుగా..’ అని సమాధానం చెప్పారు.

అయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించినట్లు నటించారు. ఆ కారణంగా తెలంగాణా ప్రజలకు శత్రువు అయ్యారు. కానీ నిజానికి రాష్ట్ర విభజన ప్రక్రియ చురుకుగా సాగడానికి ముఖ్యమంత్రి హోదాలో ఆయనే కేంద్రానికి అన్నివిధాల సహకరించారు. ఆ ప్రక్రియ సజావుగా పూర్తికాగానే తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ ని స్థాపించారు. అయన చేసిన మోసాన్ని గ్రహించిన ఏపి ప్రజలు కూడా గత ఎన్నికలలో నిర్దాక్షిణ్యంగా ఆయనను తిరస్కరించారు. 

కపట రాజకీయాలు చేయడం వలన అయన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలను దూరం చేసుకొన్నారు. పైగా ఏపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, తెలంగాణాలో రాజకీయాలు చేయలేని పరిస్థితులు నెలకొని ఉండటంతో గత నాలుగేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఇవాళ్ళ ఆ పార్టీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. 

అయితే ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. కనుక కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో ఓట్లు చీల్చి తెదేపా, వైకాపాలకు ఎంతో కొంత నష్టం కలిగించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు.