మీ వైఫల్యాలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?

సిఎం కెసిఆర్ తన వైఫల్యాలకు కాంగ్రెస్ పార్టీని లేదా ప్రతిపక్షాలను నిందించడం అలవాటుగా మారిపోయిందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

“పంచాయితీ ఎన్నికలకు బిసి జనాభా లెక్కలు తీయడం, వాటి ఆధారంగా  రిజర్వేషన్లు కేటాయించడం ప్రభుత్వం పనే కదా? వాటిని సక్రమంగా చేయలేక ఆపసోపాలు పడుతున్న తెరాస సర్కార్ ఎవరో దానిపై కోర్టులో కేసులు వేస్తే, కోర్టులో సరైన వాదనలు వినిపించలేక కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకొంటోంది. అందుకు ప్రతిపక్షాలను నిందించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తోంది. 

నిజానికి బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి సిఎం కెసిఆర్ కు లేదు. ఆయనే బిసి వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వారిని మభ్యపెడుతూ మళ్ళీ ప్రతిపక్షాలను నిందిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. సిఎం కెసిఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే శాసనసభలో పంచాయతీరాజ్ చట్టంపై చర్చ జరిపేటప్పుడు సభలో నుంచి ప్రతిపక్షాలను బయటకు పంపించేసి ‘మమ’ అనిపించేవారు కాదు. ఈవిధంగా తనకు తోచినట్లు చేసుకుపోతూ సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిపక్షాలను నిందిస్తూ సిఎం కెసిఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కనీసం ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి పంచాయితీ ఎన్నికల నిర్వహణ, బిసి జనాభా లెక్కలు, రిజర్వేషన్లపై అందరితో చర్చిస్తే మంచిది,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.