ఆ మాటకు కట్టుబడి ఉంటారు కదా?డికె అరుణ

ఆలూ లేదు...చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది కాంగ్రెస్, తెరాసల తీరు. వచ్చే ఎన్నికలలో తెరాస తప్పక గెలుస్తుందని లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటిఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరితే, కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శపధాలు చేసుకొంటున్నారు. మద్యలో ఎమ్మెల్యే డికె అరుణవంటివారు కూడా మంత్రి కేటిఆర్ కు ఆ శపథం గురించి మరోమారు గుర్తు చేసి దానికి కట్టుబడి ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని నొక్కి చెపుతున్నట్లు భావించవచ్చు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఉదయం డికె.అరుణ మీడియాతో మాట్లాడుతూ, “గతంలో మా ప్రభుత్వం హయంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసి అది మా గొప్పదనమే అని చెప్పుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ హయంలో ఏమీ చేయకపోతే ఇప్పుడు మీరు వేటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు? ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేయించారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు దుబారా చేస్తుంటే కోర్టులో కేసులు వేయకుండా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా? పాలమూరు ప్రాజెక్టులకు కేటాయించవలసిన నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించుకుపోతూ జిల్లా ప్రజలను అన్యాయం చేస్తున్నారు. ఇందుకు వచ్చే ఎన్నికలలో ప్రజలు తెరాసకు బుద్ధి చెపుతారు,” అని అన్నారు.