
సుమారు ఐదున్నరేళ్ళ క్రితం అంటే 2012, డిసెంబర్ 12వ తేదీ రాత్రి డిల్లీలో ఒక నర్సింగ్ విద్యార్ధినిపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె సుమారు రెండువారాల పాటు నరకయాతన అనుభవించి చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో ఆరుగురుదోషులలో ఒకరు మైనర్ కావడంతో శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు. మిగిలిన ఐదుగురికి మరణశిక్షలు పడ్డాయి. వారిలో ఒకడు తీహార్ జైలులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా మిగిలిన నలుగురు న్యాయవాదుల సహాయంతో ఇంతకాలం కోర్టులో కేసును సాగదీయిస్తూ మరణశిక్షలను తప్పించుకొంటున్నారు.
సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు ఈ కేసులో తుదితీర్పు చెప్పబోతోంది. వారికి సుప్రీంకోర్టు ఉరిశిక్షలు ఖరారు చేస్తుందా లేక ఇంతకాలం జైలు జీవితం గడిపినందుకు వారి ఉరిశిక్షలను యావజీవఖైదుగా మారుస్తుందా చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టు ఉరిశిక్షలు ఖరారు చేసినా వారు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకొనే అవకాశం ఉంటుంది కనుక కోర్టు తీర్పు అమలుకావడానికి మరో 3-6 నెలలు సమయం పట్టవచ్చు.
నిర్భయకేసు జరిగినప్పుడు అధికారంలో ఉన్న యూపియే ప్రభుత్వం అత్యాచారాలను అరికట్టడానికి చాలా కటినమైన చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయినా మహిళలపై అత్యాచారాలు ఆగకపోవడంతో తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించి మరింత కటినమైన శిక్షలు అమలులోకి తెచ్చింది. అయినప్పటికీ దేశంలో నానాటికీ అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అభంశుభం తెలియని చిన్నారులపై, స్కూలు విద్యార్ధినులపై కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ ఉదాసీనంగానే వ్యవహరిస్తుండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. కనీసం ఈరోజు సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు అత్యాచారాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరిక ఇవ్వగలిగేవిధంగా ఉంటే బాగుంటుంది.