టీవి స్టూడియోలకు వెళితే కబడ్దార్

తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీ ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకొంది. పార్టీ అధికార ప్రతినిధులు, అనుమతి పొందిన నేతలు తప్ప పార్టీలో ఇతరులు ఎవరూ టీవి చర్చాకార్యక్రమాలలో పాల్గొనరాదని తన నేతలు కార్యకర్తలకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆదేశాలను కాదని ఎవరైనా టీవి చర్చా కార్యక్రమాలలో పాల్గోన్నట్లయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ఇదే విషయం తెలియజేస్తూ అన్నాడిఎంకె పార్టీ మీడియాకు కూడా లేఖలు పంపింది. ఇక నుంచి టీవి స్టూడియోలలో నిర్వహించే చర్చాకార్యక్రమాలకు కేవలం పార్టీ అధికార ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించాలని కోరింది. 

అధికార అన్నాడిఎంకెలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విభేదాలున్నాయి. శశికళ మేనల్లుడు దినకరన్ కూడా పార్టీ నేతల మధ్య చిచ్చురగిలించి అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క కమల్ హాసన్ తన కొత్త పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీలో నేతలు వివిధ అంశాలు, సమస్యలపై మీడియాతో మాట్లాడుతుంటే పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుందనే ఆలోచనతో ఈ నిషేధం విధించినట్లు భావించవచ్చు. బహుశః త్వరలోనే ఇతర రాష్ట్రాలలో పార్టీలు కూడా అన్నాడిఎంకె పద్దతిని అనుసరించినా ఆశ్చర్యం లేదు.