
గ్యాంగ్స్టర్ నయీం కేసులో అనేకమంది రాజకీయ నాయకులతో పాటు కొందరు పోలీస్ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో అడిషనల్ ఎస్పిగా చేసిన మద్దిపాటి శ్రీనివాస్, ఏసిపిలు మలినేని శ్రీనివాస్ రావు, చింతమనేని శ్రీనివా కూడా ఉన్నారు. వారి ముగ్గురికి నయీంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో హోంశాఖ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. గత ఏడాది నుంచి వారు సస్పెన్షన్ లోనే ఉంచబడ్డారు. తమపై విచారణ పూర్తయి నివేదికలో దోషులుగా తెలినట్లయితే తమపై చర్యలు తీసుకోవచ్చునని, అంతవరకు తమపై సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిజిపి మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకొన్నారు. దానిపై రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది సానుకూలంగా స్పందించి వారి ముగ్గురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారు ముగ్గురు శుక్రవారం డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో నయీం కేసు వ్యవహారం కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు ముగిసింది అనుకోవచ్చు. ఓటుకు నోటు కేసు, సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల కేసులు కూడా ఇలాగే కొంతకాలం సాగదీసిన తరువాత అటకెక్కిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.