కాళేశ్వరం ప్రాజెక్టుపై కొత్త పిటిషన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నిటినీ సుప్రీంకోర్టు తిరస్కరించిన్నప్పటికీ కొత్తగా ఇంకా పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర సాగునీటిశాఖలోనే పనిచేసి పదవీ విరమణ చేసిన ఇంజనీర్ దొంతుల లక్ష్మినారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవసరానికి మించి నీటిని నిల్వ చేసేందుకు వీలుగా ప్రాజెక్టును రీ-డిజైనింగ్ చేశారని, దానికోసం రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల ప్రజాధనం వృధాచేస్తోందని లక్ష్మినారాయణ ఆరోపించారు. రూ.50,000 కోట్లతో పూర్తి చేయవలసిన కాళేశ్వరం ప్రాజెక్టును రీ-డిజైనింగ్ పేరుతో రూ.90,000 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని రీ-డిజైనింగ్ పేరుతో వృధా చేస్తున్నారని పిటిషనరు ఆరోపించారు. ప్రభుత్వం అనాలోచితంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల పధకాన్ని నిర్వహణ వ్యయం చాలా బారీగా ఉంటుందని అది రాష్ట్రానికి భారంగా మారుతుందని పేర్కొన్నారు.    

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 144 టిఎంసిలు కాగా, దాని ద్వారా 170 టిఎంసిలు అందిస్తామని ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ఒకపక్క 19 రిజర్వాయర్లతో నీటిని నిల్వ చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తూ దానిని ఒక పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని అయన తన పిటిషనులో తప్పు పట్టారు.

దొంతుల లక్ష్మినారాయణ వేసిన ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసును జూలై 9వ తేదీన విచారించనుంది.