
వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపల్ చైర్మన్, తెరాస సీనియర్ నేత మార్త రాజభద్రయ్య తన అనుచరులతో కలిసి బుధవారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “మాపార్టీకే చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కౌన్సిలర్లను కూడగట్టి నాపై అవిశ్వాసతీర్మానం చేయించడానికి కుట్రలు పన్నడం చాలా దారుణం. అయన మా అందరిపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అయనతో వేగలేకనే మేమందరం తెరాసను విడిచిపెడుతున్నాము. ఒకటి రెండు రోజులలోనే అయన బండారం బయటపెడతాము,” అని అన్నారు.
అయితే ఈ సందర్భంగా మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవిధంగా చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. “మా పార్టీ విధానాలు నచ్చినందునే ఇతర పార్టీల నేతలు వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని చెప్పడానికి ఈ చేరికలే నిదర్శనం,” అని అన్నారు.
గత నాలుగేళ్ళలో కాంగ్రెస్ పార్టీ నుంచి పేరుమోసిన నేతలు చాలా మందే తెరాసలో చేరారు కానీ తెరాస నుంచి ఒక పెద్ద నేత కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇప్పుడు కూడా తాము ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో వేగలేకనే తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని రాజభద్రయ్య స్పష్టంగా చెపుతుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ విధానాలు నచ్చి వారు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొన్నారు. ఇతర పార్టీల నేతలు చేరితే ఆ పార్టీ ఎన్నికలలో విజయం సాధిస్తుందనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన నిజమైతే తెరాసయే మళ్ళీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే తెరాసలోనే ఎక్కువ మంది చేరారు కనుక.