
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. మొన్న మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అమర్చుతున్న మోటార్లు కాంగ్రెస్ హయంలో కొనుగోలు చేసినవేనని వాటినే తెరాస సర్కార్ కొత్తవిగా పేర్కొంటోందని ఆరోపించారు. ఇప్పుడు తెరాస నుంచి తనకు ప్రాణహాని ఉందని కనుక 1+1 భద్రతను పునరుద్దరించవలసిందిగా కోరుతూ బుధవరం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. భద్రత కల్పించాలని కోరుకొంటే తప్పేమీ లేదు కానీ తెరాస నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొనడం ద్వారా తెరాస తనను హత్య చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించినట్లయింది. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో తెలియదు కానీ తెరాస హత్యారాజకీయాలకు సిద్దపడుతోందని నాగం జనార్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలను తెరాస తేలికగా తీసుకోలేదు. కనుక తెరాస తీవ్రంగా స్పందించడం ఖాయం.