తెలంగాణాలో మళ్ళీ విప్లవాలు?

తెలంగాణా సాధన కోసం ఏకధాటిగా సుమారు 14 ఏళ్ళ పాటు ఉద్యమాలు సాగిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో మళ్ళీ మరోసారి విప్లవం రాబోతోందని మంత్రి కేటిఆర్ చెప్పారు. అయితే ఈసారి ఒకటి కాదు...ఏకంగా నాలుగు విప్లవాలు రాబోతున్నాయని చెప్పారు. 

సోమవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కేటిఆర్ రెండవ విడత రాయితీ గొర్రెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో నాలుగు విప్లవాలు రాబోతున్నాయి. అవి హరిత విప్లవం, నీటి విప్లవం, శ్వేత, గులాబీ విప్లవాలు. వ్యవసాయానికి సాగునీరు అందించి హరిత విప్లవం సాధిస్తాము. చెరువులలో చేపలు పెంపకంతో నీటి విప్లవం, పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా  శ్వేత విప్లవం, మాంసం ఉత్పత్తులను ఎగుమతి చేసి ‘గులాబీ విప్లవం’ సాధిస్తాము.”

“సిఎం కెసిఆర్ కెసిఆర్ ఏదైనా ఒక పని చేపడితే అది సాధ్యమేనా? అని అందరూ మొదట సందేహిస్తారు. రాయితీ గొర్రెల పంపిణీ ద్వారా గొల్ల, కురుమలకు జీవనోపాధి కల్పిస్తూనే రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడం ద్వారా పెద్ద ఆర్దికవనరును సృష్టించుకోవచ్చునని సిఎం కెసిఆర్ చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ సిఎం కెసిఆర్ ఆలోచన నిజమని ఇప్పుడు రుజువైంది. గత ఏడాది సుమారు 60 లక్షల గొర్రెలు పంపిణీ చేయగా, వాటికి 25 లక్షల గొర్రెపిల్లలు పుట్టాయి. తద్వారా గొల్లకురుమల వద్ద సుమారు రూ.1,000 కోట్లు విలువగల సంపద ఏర్పడింది. ఈ ఏడాది మరిన్ని గొర్రెలు పంపిణీ చేస్తాము. సిఎం కెసిఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మీ కోసం అమలుచేస్తున్న ఈ గొప్ప పధకాన్ని ఎవరూ దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

పాడిపరిశ్రమ ద్వారా కూడా ఇదేవిధంగా సంపద సృష్టించవచ్చని భావించిన సిఎం కెసిఆర్ రూ.900 కోట్లతో గేదెలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.