
రైతుబంధు పధకంతో ప్రజలలో మంచిపేరు పొందవచ్చని తెరాస సర్కార్ భావిస్తే, దానిని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడం వలన ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది. ఈ సమస్యకు శాశ్వితంగా ముగింపు పలికేందుకు తెలంగాణా కౌలు రైతుల రక్షణ చట్టం-1950ను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఆ చట్టంలోని సెక్షన్:10(4) ప్రకారం కౌలు రైతులు బ్యాంకుల నుంచి పంటరుణాలు పొందేందుకు ప్రభుత్వం ఇస్తున్న రుణఅర్హత కార్డులను (లోన్ ఎలిజిబిలిటీ కార్డులు) రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
గత మూడేళ్ళ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 19వరకు మొత్తం 43,127 మంది కౌలు రైతులు రుణఅర్హత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో కేవలం 8,625 మందికి మాత్రమే అధికారులు మంజూరు చేశారు. అలాగే కొత్త పాసుపుస్తకాలలో కౌలు రైతుల వివరాలు నమోదు చేసే కాలమ్ లేదు. అంటే కౌలు రైతుల దారులు ఒకటొకటిగా అన్నీ మూసుకుపోతున్నట్లే భావించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ చట్టం-1950ను రద్దు చేసినట్లయితే రాష్ట్రంలో కౌలు రైతులు అందరూ వేరేదారి చూసుకోక తప్పదు.