
హైదరాబాద్ టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు నిర్మల్ జిల్లాలో ఎల్లపెల్లి గ్రామంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరోముగ్గురు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారందరూ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఇన్నోవాకారులో బయలుదేరి కుంటాల జలపాతం చేరుకొన్నారు. అక్కడ కాసేపు సరదాగా గడిపిన తరువాత హైదరాబాద్ బయలుదేరారు. వారి కారు నిర్మల్ జిల్లాలో ఎల్లపెల్లి గ్రామం వద్దకు చేరుకొన్నప్పుడు టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డుమీద డివైడర్ ను డ్డీకొని పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న దినేష్ (27), అయన పక్కనే కూర్చొన్న కుసుమ (28) అక్కడికక్కడే చనిపోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో శ్రీవిద్య అనే ఉద్యోగిని చికిత్స పొందుతూ చనిపోయింది. యుగంధర్, శ్రీవిద్య అనే మరో ఇద్దరు ఉద్యోగులను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు.