కౌలురైతులకు పంటపెట్టుబడి ఇవ్వలేము: కెసిఆర్

రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీపై సిఎం కెసిఆర్ శనివారం ప్రగతిభవన్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన ఈ పధకంపై తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.

“రైతుబంధు పధకం స్వంతభూమి కలిగి వ్యవసాయం చేసే రైతులకోసం ఉద్దేశ్యించినది. కానీ కౌలురైతులకు కూడా దీనిని వర్తింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏవిధంగా ఏ ప్రాతిపదికన అమలుచేయాలో ఎవరూ చెప్పరు. కేవలం విమర్శలు గుప్పిస్తుంటారు. రకరకాల ఆస్తులు లీజుకు తీసుకుంటుంటారు. అంతమాత్రన్న లీజుకు తీసుకున్నవ్యక్తి ఆ ఆస్తికి యజమాని, హక్కుదారుడు అయిపోతాడా? కౌలురైతులు కూడా అటువంటివారే. వారి పేర్లు వివరాలు ఏ ప్రభుత్వ రికార్డులలో నమోదుకాలేదు. అటువంటప్పుడు వారికి ఏవిధంగా ఈ పధకాన్ని వర్తింపజేయగలము? రైతుబంధు పధకం కోసం ప్రభుత్వం రూ.12,000 కోట్లు మంజూరు చేసింది. ఈ పధకం పేరు చెప్పి ఎవరికీ పడితే వారికి డబ్బు పంచిపెట్టలేము కదా?లీజు విషయంలో ఇతరులకు కల్పించలేని సౌకర్యాలు, రాయితీలు కౌలురైతులకు ఏవిధంగా వర్తింపజేయగలము?కౌలురైతుల పేరిట నిజమైన రైతులకు అన్యాయం చేయలేము,” అని అన్నారు.