.jpg)
గద్వాల నడిగడ్డ ప్రగతిసభలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు ఇద్దరూ అన్నీ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేలంపాడు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కటిస్తే తన ప్రభుత్వం కట్టించిందని చెప్పుకోవడానికి కెసిఆర్ కు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. అలాగే పాలమూరులో లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయంలోనే నీళ్ళు అందిస్తే మామాఅల్లుళ్ళు (కెసిఆర్, హరీష్ రావు) తామే జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు పారించామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. వచ్చే ఎన్నికలలో గద్వాల నుంచే తెరాస విజయప్రస్తానం మొదలవుతుందని మామాఅల్లుళ్ళు చెప్పుకొన్నప్పటికీ, అక్కడి నుంచే తెరాస పతనం ప్రారంభం అవుతుందని డికె అరుణ అన్నారు. వాస్తవానికి పరిస్థితులు అనుకూలించి ఉండి ఉంటే హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారని అన్నారు. తెరాస నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని డికె అరుణ హెచ్చరించారు.
గద్వాల బహిరంగసభపై డికె అరుణ ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణం తనకు కంచుకోటవంటి గద్వాలలో తెరాస పట్టు సాధించాలని ప్రయత్నించడమేనని చెప్పవచ్చు. రాష్ట్రంలో తనకు సవాలు విసిరే పార్టీలను చూసి తెరాస ఏవిధంగా తీవ్రంగా స్పందిస్తుంటుందో డికె అరుణ కూడా అదేవిధంగా అదే కారణం చేత తీవ్రంగా స్పందించారని చెప్పవచ్చు. కనుక ఇకపై ఆమె తన నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు మరింత గట్టిగా ప్రయత్నించవచ్చు.