తెదేపా ఎంపిలు మీడియాకు దొరికిపోయారు

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ తెదేపా నేతలు సీఎం రమేశ్‌‌, బీటెక్‌ రవి కడపలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తుంటే, డిల్లీ వెళ్ళి కేంద్రమంత్రిని కలిసిన తెదేపా ఎంపిలు ఆ తరువాత ఏపి భవన్ లో తమ దీక్షల గురించి సరదాగా ముచ్చటించుకున్నారు. అప్పుడు ఎవరో దానిని వీడియో తీసి మీడియాకు పంపారు. ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఆ వీడియో దర్శనమిస్తోంది. 

దానిలో తెదేపా ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ “నేను 5 కేజీలు బరువు తగ్గాలనుకొంటున్నాను. ఒక వారం రోజుల వరకైతే దీక్ష చేయగలను” అని అంటే మరో ఎంపి జేసి దివాకర్ రెడ్డి కల్పించుకొని, “ఈయన్ను పెడదాం..డన్!” అని అన్నారు. మరో తెదేపా ఎంపి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ “(రైల్వే)జోను లేదు గీను లేదు” అని అన్నారు. 

తెదేపా ధర్మదీక్షలు, ధర్మపోరాటాల గురించి ఆ పార్టీ ఎంపిలే అంత చవుకబారుగా మాట్లాడుకోవడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. తెదేపా ఎంపిల సంభాషణల వీడియో క్లిప్పింగ్ మీడియాలో వచ్చేయడంతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు వారిపై సీరియస్ అయ్యారు. మనం చేస్తున్న పోరాటాలపై మనకే చిత్తశుద్ధి లేకపోతే ఎలాగ? నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా?” అని నిలదీసినట్లు సమాచారం. 

కానీ తమ ధర్మపోరాటంపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే బురదజల్లి అప్రదిష్టపాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముసుగులో కొందరు తమ ఎంపిలు మాటలను మార్ఫింగ్ చేసి వక్రీకరించారని, తమ పవిత్ర ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకే ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని అన్నారు. 

కానీ తెదేపా ఎంపిలు వారి మాటలు వీడియోలో అంత స్పష్టంగా కనబడుతుంటే కుట్ర అని వాదించడం హాస్యాస్పదంగా ఉంది. ఏపి ప్రయోజనాలను కాపాడుకొనే విషయంలో ఎంపిలకు చిత్తశుద్ధిలేదని స్పష్టమవుతున్నప్పుడు మీడియాను, ప్రతిపక్షాలను నిందించి ఏమి ప్రయోజనం?

 

(వీడియో ఈనాడు సౌజన్యం )