
ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పధకానికి శంఖుస్థాపన చేయడానికి వస్తున్నందున, పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను గృహనిర్బంధం చేశారు. ఆలంపూర్ లోని అయన క్యాంప్ కార్యాలయం వద్ద నిన్నరాత్రి నుంచే బారీగా పోలీసులను మొహరించారు. సిఎం కెసిఆర్ అధికారిక పర్యటనలో సంపత్ కుమార్ ఇబ్బంది కలిగించవచ్చనే కారణం చేతనే గృహనిర్బందం చేశారు.
దీనిపై సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిని అకారణంగా గృహనిర్బందం చేయడం దేనికని ప్రశ్నిస్తూ సిఎం కెసిఆర్ కు ఒక బహిరంగ లేఖ వ్రాశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో అయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ నిరకుశత్వానికి ఇది పరాకాష్ట. ఒక దళిత ఎమ్మెల్యేను అకారణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అతను దళితుడు కనుకనే శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు మందలించినా పట్టించుకోలేదు. ఇప్పుడు అకారణంగా గృహనిర్బంధం చేశారు. ఒక ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడాలనుకోవడం నేరమా? సంపత్ కుమార్ ను తక్షణం విడిచిపెట్టాలి,” అని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే సంపత్ కుమార్ సిఎం కెసిఆర్ పర్యటనలో ఇబ్బంది కలిగించవచ్చనే ఆలోచనతో గృహనిర్బందం చేయడం వలన, తెరాస సర్కార్ పై అయన హైకోర్టులో మరోసారి కేసు వేసే అవకాశం కల్పించిందని చెప్పవచ్చు.ఒకవేళ అయన హైకోర్టులో కేసు వేస్తే ఆయనను ప్రభుత్వం గృహనిర్బందంలో ఎందుకు ఉంచిందో కోర్టుకు సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అతని వలన ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతుందని అరెస్ట్ చేశామని చెపితే హైకోర్టు చేత మొట్టికాయలు తినవలసి వస్తుంది. కానీ అంతకుమించి వేరే కారణం కనబడటం లేదు. ఎందుకంటే సంపత్ కుమార్ తీవ్రవాది కాదు. ఒక ప్రజాప్రతినిధి. జిల్లాలో ముఖ్యమంత్రి జరుగుతున్నప్పుడు ఆయనను కలిసి సమస్యలు చెప్పుకొనే హక్కు కలిగిఉన్నారు. సంపత్ కుమార్ శాసనసభ్యత్వం రద్దు చేసి ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పించింది తెరాసయే. ఇప్పుడు దీనితో మరో అవకాశం కల్పిస్తోందేమో?