రేషన్ డీలర్లపై ప్రభుత్వం చర్యలు షురూ

జూలై 1వ తేదీ నుంచి సమ్మెకు సిద్దమవుతున్న రాష్ట్రంలోని 17,200 మంది రేషన్ డీలర్లపై కటినచర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. ముందుగా వారందరికీ రేపటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు పంపించడం మొదలుపెడతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా కమీషనర్ అకున్ సభర్వాల్ చెప్పారు. అప్పటికీ వారు దిగిరాకపోతే వారి లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. రేషన్ డీలర్లు డిడిలు తీసి, జూలై రేషన్ సరుకులు విడిపించుకోకపోవడంతో వారిపట్ల కటినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

కమీషనర్ అకున్ సభర్వాల్ ఈరోజు అన్ని జిల్లాల పౌరసరఫరాలశాఖ అధికారులతో హైదరాబాద్ లో సమావేశమయ్యి రేషన్ డీలర్ల సమ్మె, తదనంతర పరిణామాల గురించి చర్చించారు. జూలై 5వ తేదీ నుంచి 10వరకు అన్ని జిల్లాలలో మహిళాసంఘాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్ల సంఘాల నేతలు దీనిపై ఇంకా స్పందించవలసి ఉంది.