
ఒకప్పుడు హైదరాబాద్ నగరం గురించి చెప్పుకోవలసివస్తే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, దమ్ బిర్యానీ, ముత్యాల ప్రస్తావన వచ్చేది. ఆ తరువాత ఆ జాబితాలో హైటెక్ సిటీ చేరింది. తెలంగాణా ఏర్పడిన తరువాత ఆ జాబితాలో నిత్యం అనేక కొత్తకొత్త పేర్లు, ప్రదేశాలు, సంస్థలు వచ్చి చేరుతుండటంతో హైదరాబాద్ గురించి ఎప్పటికప్పుడు అప్-డేట్ కావలసివస్తోంది.
తాజాగా ఆ జాబితాలో ‘నైట్ సఫారీ పార్క్’ కూడా చేరబోతోంది. అవుటర్ రింగ్ రోడ్డులో కొత్వాల్ గూడా వద్ద 80-85 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేయడానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు మంత్రి కేటిఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. రూ.35 కోట్లు వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు.
సాధారణంగా అడవిజంతువులను చూడాలనుకునేవారు నగరాలలో, పట్టణాలలో ఏర్పాటు చేసే జంతు ప్రదర్శనశాలలకు వెళుతుంటారు. కానీ ఈ నైట్ సఫారీ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ పెంచబడే అడవులలో అన్ని రకాల జంతువులు స్వేచ్చగా తిరుగుతుంటాయి. వాటిని చూసేందుకు మనుషులే ప్రత్యేకంగా తయారుచేసిన వాహనాలలో వెళ్ళవలసి ఉంటుంది.
ప్రపంచ ప్రసిద్ధిపొందిన నైట్ సఫారీ పార్క్ సింగపూర్ లో ఉంది. అదే మోడల్ లో హైదరాబాద్ నగరంలో కూడా ఒకటి నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. చైనా, ధాయిలాండ్, మలేషియా, జాంబియా, లావోస్ దేశాలలో ఇటువంటి నైట్ సఫారీ పార్కులకు విశేషాదరణ లభిస్తోంది.
మనదేశంలో యూపిలోని గ్రేటర్ నోయిడా సమీపంలో నైట్ సఫారీ పార్క్ ఉంది. కేరళలో ‘తేకడి’ వంటి కొన్ని పర్యాటక ప్రాంతాలను ఆనుకొని ఉన్న దట్టమైన అడవులలో సంచరించే జంతువులను చూసేందుకు కేరళ రాష్ట్రపర్యాటకశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
త్వరలోనే సంబంధిత శాఖల అధికారులు సింగపూర్ నైట్ సఫారీ పార్క్ సందర్శనకు వెళ్లి చూసి, అక్కడి అధికారులతో మాట్లాడివస్తారు. జంతువులు స్వేచ్చగా సంచరించేందుకు వీలుగా కొత్వాల్ గూడాలో 80-85 ఎకరాలలో అడవులు పెంచినట్లయితే అది హైదరాబాద్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. నగరం సమీపంలోనె నైట్ సఫారీ ఏర్పాటు చేసినట్లయితే దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది కనుక ఆ మేరకు రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం కొత్వాల్ గూడాలో 40 ఎకరాలు ప్రభుత్వభూములున్నాయి. కనుక మరో 40-45 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. అతి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేసే ఈ ప్రాజెక్టుకు ఎవరి నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చు కనుక అతి త్వరలోనే ఇది సాకారం కావచ్చు. అప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకోవలసినప్పుడు నైట్ సఫారీ పార్క్ పేరును చెప్పుకోవలసి ఉంటుంది.