
రాష్ట్రంలో కొన్ని మారుమూల తండాలను కలిపి పంచాయితీలుగా మార్చుతున్న సంగతి తెలిసిందే. అలాగే పట్టణాలకు దగ్గరలో ఉన్న 308 పంచాయితీలను 71 మున్సిపాలిటీలలో విలీనం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దాంతో అప్పటి వరకు గ్రామపంచాయితీ క్రింద ఉండే ఆ ప్రాంతాలు పట్టణపరిధిలోకి వస్తాయి. అలాగే మరికొన్ని పంచాయితీలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో పంచాయితీ పాలకమండళ్ళ పదవీకాలం త్వరలోనే ముగియబోతోంది. అప్పటి నుంచి71 మున్సిపాలిటీలలో విలీనమైన పంచాయితీల పరిధిలో ప్రాంతాలు అన్నీ మున్సిపాలిటీ క్రిందకు వస్తాయి.
ఈ విలీనం తరువాత ఆ ప్రాంతాలన్నీ పట్టణపరిధిలోకి వస్తాయి కనుక ఇంతవరకు గ్రామపంచాయితీలకు చెల్లిస్తున్న ఆస్తిపన్నుకు రెండు-మూడు రెట్లు అధనంగా చెల్లించవలసి ఉంటుంది. మున్సిపాలిటీలలో విలీనం అవుతున్న మొత్తం 308 పంచాయితీల పరిధిలో ఉన్న ప్రాంతాలలో ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తిపన్నుల లెక్కలు చూసి, ఇకపై చెల్లించవలసిన ఆస్తిపన్నును ఖరారు చేసేందుకు రాష్ట్ర పురపాలకశాఖ డైరెక్టర్ టికె శ్రీదేవి నేతృత్వంలో ఆస్తిపన్నుల బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. ఆస్తి పన్నులకు సంబంధించి డిమాండ్-కలెక్షన్-బ్యాలెన్స్ రిపోర్టులను జిల్లాలలో పంచాయితీ అధికారుల నుంచి సేకరించి పంపాలని జిల్లాల పురపాలకశాఖ అధికారులకు ఆదేశించారు.
మున్సిపాలిటీలలో గ్రామపంచాయితీల విలీనంతో ఆ ప్రాంతాలలో మౌలికవసతులు అభివృద్ధి చెందుతాయి. కానీ వాటికోసం ప్రజలు అధనపు పన్ను చెల్లించక తప్పదు. అయితే ఇది ఎన్నికల సంవత్సరం కనుక పన్నులు పెంచినట్లయితే ప్రజల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది కనుక బహుశః ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను సాగదీసి ఆ తరువాత తాపీగా వడ్డించవచ్చు.