
రాజధాని హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. దానికి జంటగా ఉన్న హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ‘సినీవారం’ పేరిట ప్రతీ శనివారం సాయంత్రం ఉచిత సినిమా ప్రదర్శనలకు రాష్ట్ర సాంస్కృతిక అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక రెండువారాలలోగా సినీ ప్రదర్శనలు మొదలుపెట్టబోతున్నామని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పలుప్రాంతాలలో నిర్వహిస్తున్న సినీవారం కార్యక్రమాలలో ఔత్సాహిక దర్శకులు, నిర్మాతలు, వర్ధమాన నటీనటులు రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్, ఎంపిక చేసిన కొన్ని తెలుగు సినిమాలను ప్రదర్శిస్తున్నారు. సినీవారం కార్యక్రమం మొదలుపెట్టిన తరువాత రాష్ట్రంలో అనేకమంది ఔత్సాహిక దర్శకులు, కెమెరా మ్యాన్లు, కళాకారులు తమ ప్రతిభను చాటుకొని మంచి గుర్తింపు పొందుతున్నారు. వారిలో చాలా మంది తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు కూడా పొందుతున్నారు. కనుక సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ సినీవారం కార్యక్రమానికి అతి సినీ పరిశ్రమ నుంచి ఇటు ప్రజల నుంచి కూడా విశేషాధరణ లభిస్తోంది. ఇటువంటి మంచి కార్యక్రమం ఇక నుంచి వరంగల్ ప్రజలకు కూడా అందుబాటులోకి రానుంది.