కెసిఆర్ రాజీనామా చేస్తానంటే వద్దంటామా: కాంగ్రెస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్దామని సిఎం కెసిఆర్ విసిరినా సవాలుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “కెసిఆర్ రాజీనామా చేస్తానంటే వద్దంటామా..ముందస్తు ఎన్నికలకు వెళ్దామంటే మేము ఎందుకు అడ్డుకొంటాము? మేము స్వాగతిస్తాము. ఇప్పుడే కాదు... ఏడాది క్రితం రాజీనామా చేస్తానని అయన చెప్పినా ఎవరూ వద్దనేవారు కారు. కెసిఆర్ కుటుంబపాలన ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అయనను రాజీనామా చేయవద్దని ఎవరూ వేడుకోవడం లేదు కదా? నాలుగేళ్ళపాటు ప్రతిపక్షాలతో ఒక్కసారి కూడా సమావేశం  కానీ ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయాలా వద్దా? అని మమ్మల్ని అడగుతున్నాడంటే నమ్మశక్యంగా లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెరాసను గద్దె దించడం ఖాయం,” అని అన్నారు.