
తెలంగాణా జనసమితి (టిజెఎస్)ని బలోపేతం చేసుకొని ఎన్నికలకు సిద్ధమయ్యే ప్రయత్నంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్ని జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నపుడు మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలు, ప్రతిపక్షాల గురించి సిఎం కెసిఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా స్పందించారు.
అయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగనివిధంగా అయన మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల గురించి, ముందస్తు ఎన్నికల గురించి అయన మాట్లాడిన మాటలు చాలా వెకిలిగా ఉన్నాయి. అవి అయన అహంకారానికి అద్దం పడుతున్నాయి. గత నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసిన సిఎం కెసిఆర్ మళ్ళీ మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్దం అయ్యారు. అయితే ప్రజలు కూడా అయన మాటలకూ, చేతలకు మద్య ఉన్న తేడాను గుర్తిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో వారు ఆయనకు తగినవిధంగా బుద్ధి చెపుతారని భావిస్తున్నాను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి మేము కూడా సిద్దంగా ఉన్నాము. పంచాయితీ ఎన్నికలతోనే మా బలం ఏమిటో నిరూపించి చూపుతాము,” అని అన్నారు.