మేము అధికారంలోకి వస్తే... లక్ష్మణ్

ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న కారణంగా రాజకీయపార్టీలలో హడావుడి మొదలైపోయింది. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న రాష్ట్ర భాజపా కూడా ‘జనచైతన్య యాత్ర’ మొదలుపెట్టింది. దానిలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలో భాజపా బహిరంగ సభ నిర్వహించింది. 

ఆ సభలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణాల మాఫీ చేస్తాము. వాటిపై వడ్డీని కూడా మాఫీ చేస్తాము. సిఎం కెసిఆర్ హామీలన్నీ మాటలకే పరిమితం తప్ప చేతలలో కనబడవు. ఎంబిసి కార్పోరేషన్ ఏర్పాటుచేసి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ దానిలో ఒక్క పైసా జమా చేయలేదు. బిసిల సంక్షేమం కోసం గొర్రెలు, బర్రెలు, చేపలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటారు. కానీ అది అధికారం తమ గుప్పెట్లో నుంచి జారిపోకుండా కాపాడుకునేందుకే. తమకు అన్యాయం జరుగుతోందని తెలిసి ఉన్నా కొంతమంది బిసి నేతలు కెసిఆర్ భజనలో మునిగిపోయారు. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువున్నా బిసిలకు న్యాయం జరగాలంటే వచ్చే ఎన్నికలలో భాజపాకే ఓట్లేసి గెలిపించాలి. ఇక జిల్లా నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడుసార్లు ఎంపిగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా అభివృద్ధికి ఏమి చేయలేదు. తెరాస సర్కార్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, కమీషన్లు మింగడం మినహా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదు. తెరాస సర్కార్ పతనం ఈ చైతన్యయాత్రతోనే మొదలవుతుంది,” అని అన్నారు. 

రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా  నిర్వహించలేని పిరికి ప్రభుత్వం ఈ తెరాస సర్కార్. ముస్లింల ఓట్ల కోసం సిఎం కెసిఆర్ మజ్లీస్ పార్టీ కనుసన్నలలో నడుచుకొంతున్నారు. అందుకే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి భయపడుతున్నారు. ఇదివరకు కాంగ్రెస్, తెదేపాలకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత తెరాసకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఈ మూడు పార్టీలు తెలంగాణాకు చేసిందేమీ లేదు. కనుక ఈసారి రాష్ట్ర ప్రజలు భాజపాకు ఒక అవకాశం కల్పిస్తే, దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలు ఏవిధంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయో, తెలంగాణాను కూడా అదేవిధంగా అభివృద్ధి చేసి చూపిస్తాము. మేము కెసిఆర్ లాగ కుటుంబపాలన సాగించము. తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తాము. కళ్ళకు కనబడేవిధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపుతాము,” అని అన్నారు.