లింగంపల్లిలో రోడ్డు ప్రమాదం

రాష్ట్రంలో వరుసగా రెండవరోజు కూడా ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద సోమవారం ఉదయం కూరగాయలను తీసుకువెళుతున్న ఒక ఆటోను ఎదురుగా వచ్చిన కారు డ్డీకొనడంతో ఆటో డ్రైవర్ తో సహా దానిలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

చెన్నారెడ్డిగూడెంకు చెందిన కొందరు మహిళలు ప్రతీరోజు ఆటోలో కూరగాయలు వేసుకొని హైదరాబాద్ నగరం వచ్చి అమ్ముకొంటుంటారు. ఈరోజు ఉదయం కూడా వారు ఆటోలో కూరలు వేసుకొని బయలుదేరారు. వారి ఆటో లింగంపల్లి వద్దకు చేరుకున్నప్పుడు, ఎదురుగా వస్తున్న ఒక కారు అదుపుతప్పి బలంగా ఆటను డ్డీకొంది. ఆ దెబ్బకి ఆటో డ్రైవర్ శ్రీనుతో పాటు అతని పక్కనే కూర్చొన్న ఇద్దరు మహిళలు నలిగిపోయారు. ఆ ధాటికి ఆటోలో మిగిలినవారు రోడ్డుపైకి విసిరేసినట్లు ఎగిరిపడి చనిపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని, గాయపడినవారిని ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయినవారిని ఆటో డ్రైవర్ శ్రీను, మాధవి. అఫిలీ, మారు, సుజాతలుగా పోలీసులు గుర్తించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఆ సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటనే దానిపై ఇంకా సమాచారం అందవలసి ఉంది.