
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి 14మంది మహిళలు, ఒక బాలుడు మృత్యువాత పడ్డారు.
గుంటూరు జిల్లాకు చెందిన వెంకటనారాయణ అనే ఒక వ్యక్తి తన పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వేములకొండ నుంచి 26 మంది మహిళా కూలీలను ట్రాక్టర్ లో తీసుకొని వెళుతుండగా, ట్రాక్టర్ గ్రామం సరిహద్దు వద్ద కల్వర్టు దాటుతుండగా స్టీరింగ్ వదిలి సిగరెట్ వెలిగించుకొంటున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఒక మోటార్ సైకిల్ వచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న మూసీ కాలువలో బోర్లాపడిపోయింది. ఆ సమయంలో డ్రైవర్ తో సహా అతనికి ఇరుపక్కలా కూర్చొన్న ఏడుగురు కూలీలు, ట్రాక్టరు ట్రాలీలో కూర్చున్న మరో నలుగురు బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అంతా రెప్పపాటు సమయంలో జరిగిపోవడంతో ట్రాలీలో కూర్చొన్న మహిళలకు ఏమి జరుగుతుందో తెలిసేలోపే, ట్రాలీ కాలువలో దూసుకుపోవడం వారు గుర్రపుడెక్కతో నిండిన నీళ్ళలో పడటం వారి మీద ట్రాక్టర్ ట్రాలీ బోర్లాపడింది.
చెరువులో నీళ్ళు గుర్రపుడెక్కతో నిండిపోవడంతో వారు దానిలో చిక్కుకుపోయి నీళ్ళలో నుంచి బయటకు రాలేకపోయారు. స్థానికులు వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న14మంది మహిళా కూలీలు, ఒక బాలుడు చనిపోయారు. ట్రాక్టర్ లో నుంచి దూకేసినవారు స్వల్పగాయలతో బయటపడగలిగారు. వారిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ వెంకటనారాయణ ట్రాక్టర్ లో నుంచి దూకేసి ప్రాణాలతో బయటపడగలిగాడు. పోలీసులు అతనిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి అభ్యర్ధన మేరకు చనిపోయినవారికి గ్రామంలోనే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతించారు. భువనగిరి, రామన్నపేట ఏరియా ఆసుపత్రుల నుంచి వచ్చిన ఆరుగురు వైద్యులు మృతులకు గ్రామంలోనె పోస్ట్ మార్టం నిర్వహించారు.
మృతులలో శకుంతల(35) తప్ప మిగిలిన 13మంది వేములకొండ గ్రామానికి చెందినవారే కావడంతో ఆ గ్రామంలో ఏ ఇంట చూసినా రోదనలే వినిపిస్తున్నాయి. మృతుల వివరాలు: అరూర్ మణెమ్మ(36), సుంచు నర్మద(25) కాడిగల్ల లక్ష్మమ్మ(38) కాడిగల్ల మానస (15) (లక్ష్మమ్మ కూతురు), ఇంజమూరి శంకరమ్మ(55), ఇంజమూరి నర్సమ్మ(35), బీసు కవిత(32), గన్నెబోయిన అండాలు(35), పంజాల భాగ్యమ్మ(35), అంబాల రాములమ్మ(55), బందారపు స్వరూప(30), ఏనుగుల మాధవి(40) జడిగె మారమ్మ(55), మల్లికార్జున్(3).